దీపావళి పండుగ సమీపిస్తుండగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా టపాసులను నిషేదించింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దీపావళి పండుగ సమయంలో టపాసులపై పూర్తి నిషేదం విధించింది. జనవరి 1,2023 వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఢిల్లీలో అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేదాన్ని విధిస్తున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆన్‌లైన్ బాణాసంచా విక్రయాలకు సైతం నిషేధం వర్తిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
సాదారణంగా మిగతా నగరాల్లో పోలిస్తే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. చలికాలం వచ్చిందంటే చాలు గాలిలో నాణ్యత మరింత తగ్గుతోంది. చలి కారణంగా పొగమంచు, వాహనాల నుంచి వచ్చే పొగకు తోడు పలు రాష్ట్రాల్లో వ్యవసాయ పొలాల్లో వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. వీటికి తోడు దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుండంతో టపాసుల అమ్మకాలపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిషేదం విధిస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబర్ 28 నుంచి 2022 జనవరి 1 వరకు బాణా సంచా విక్రయాలు, వినియోగంపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా నిషేదం విధించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు.