ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేబినేట్ కూర్పులో వైవిద్యం...ఆ నాలుగు శాఖలు బ్రిటీషేతరులకే

international |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 10:37 PM

పరిపాలన బాధ్యత చేపట్టిన వెంటనే ప్రధానిగా తన మంత్రివర్గ కూర్పును గతానికి భిన్నంగా...చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విస్తరించారు బ్రిటన్ ప్రధాని లిజ్‌ ట్రస్‌.  కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా విజయం సాధించిన లిజ్‌ ట్రస్‌ బ్రిటన్ ప్రధాని మంత్రిగా అధికారికంగా నియమితులయ్యారు. బ్రిటన్‌ ప్రధానిగా ట్రస్‌ను క్వీన్‌ ఎలిజబెత్‌ 2 నియమించారు. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో ఉన్న రాణి ఎలిజబెత్‌‌ను లిజ్‌ ట్రస్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాణి ఎలిజబెత్‌ సూచించడంతో అందుకు ట్రస్‌ అంగీకరించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్.. తన క్యాబినెట్‌‌‌ కూర్పులో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. కీలకమైన నాలుగు శాఖలకు బ్రిటిషేతరులను మంత్రులుగా నియమించారు. బ్రిటన్ చరిత్రలో శ్వేతజాతీయులు ఎవరూ ఈ కీలక నాలుగు శాఖలకు మంత్రులుగా లేకపోవడం ఇదే మొదటిసారి.


లిజ్ ట్రస్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా క్వాసీ క్వార్టెంగ్ , విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవరీల ను నియమించారు. బ్రిటన్‌లో ఆర్థిక, విదేశాంగ శాఖలకు మంత్రులుగా నియమితులైన మొట్టమొదటి నల్లజాతీయులు కావడం గమనార్హం. క్వాసీ క్వార్టెంగ్ తల్లిదండ్రులు 1960లో ఘ‌నా నుంచి బ్రిటన్‌కు వలసరాగా.. జేమ్స్ క్లీవరీ తల్లిది సియోర్రా లియోన్, తండ్రి మాత్రం బ్రిటిషరే.


హోం మంత్రిగా నియమించిన సుయెల్లా బ్రేవర్ మాన్ తల్లిదండ్రులు ఆరు ద‌శాబ్దాల కింద‌ట కెన్యా, మారిష‌స్‌ల నుంచి బ్రిట‌న్‌కు వల‌స వెళ్లారు. ప్రీతి ప‌టేల్ త‌ర్వాత మైనార్టీ హోం సెక్ర‌ట‌రీ లేదా అంత‌ర్గ‌త మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండో నల్లజాతీయురాలు సుయెల్లా. పోలీసు, ఇమ్మిగ్రేష‌న్ విభాగాలకు ఆమె బాధ్య‌త వ‌హించ‌నున్నారు. కొన్నేళ్ల కిందట వరకూ యూకేలో ఎక్కువ‌గా శ్వేత జాతీయుల‌నే ఈ కీలక శాఖలకు మంత్రులుగా నియమించేవారు. క్రమంగా ఈ పరిస్థితి మారింది. 2002లో నల్లజాతీయులైన ప్రీతి పటేల్‌ మైనార్టీ హోం మంత్రిగా, పాల్ బౌటెంగ్‌ ఆర్థిక మంత్రిగా నియమించారు. జాన్సన్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.


‘రాజకీయాల్లో వేగం పెరిగింది.. ఈ మార్పు వేగం అసాధారణమైంది.. ఈ వైవిధ్యాన్ని మేము ఇప్పుడు సాధారణమైనదిగా పరిగణిస్తున్నాం’ వలస, గుర్తింపుపై దృష్టి సారించే థింక్ ట్యాంక్ బ్రిటిష్ ఫ్యూచర్ డైరెక్టర్ సుందర్ కట్వాలా అన్నారు. అయితే, వ్యాపార, న్యాయ, పౌర సేవలు, రక్షణ శాఖలు మాత్రం శ్వేతజాతీయుల చేతుల్లోనే ఉన్నాయి.


ఏది ఏమైనప్పటికీ 1868లో బెంజమిన్ డిస్రేలీలో మొదటి యూదు ప్రధాన మంత్రిని నియమించడం సహా కీలక స్థానాల్లో స్థానికేతర జాతి వ్యక్తుల నియమించడంలో కన్జర్వేటివ్‌లు మిగతా పార్టీల కంటే ముందున్నారు. మైనారిటీ ఓటర్లు ప్రతిపక్ష లేబర్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ అధికార పార్టీ జాత్యహంకారం, స్త్రీద్వేషం, ఇస్లామోఫోబియా ఆరోపణలను ఎదుర్కొంది.


మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ 2019లో ముస్లిం మహిళలు బురఖాలు ధరించడంతో లెటర్ బాక్సుల్లా కనిపిస్తున్నారని నోరుజారి క్షమాపణలు చెప్పారు. బ్రిటన్‌కు ప్రధానులైన ముగ్గురు మహిళలూ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందినవారే. మార్గరెట్ థాచర్, థెరిసా మే., ఇప్పుడు లిజ్ ట్రస్. 1895లో ఆసియా సంతతికి చెందిన మొదటి ప్రజా ప్రతినిధి మాంచెర్జీ భౌనాగ్రీ కూడా కన్జర్వేటివ్‌ పార్టీ నుంచే ఎన్నికయ్యారు. జాన్సన్ మంత్రివర్గంలో పనిచేసిన ముగ్గురు ఆర్థిక మంత్రుల్లో ఇద్దరు దక్షిణాసియా, ఒకరు కుర్దిష్ కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com