దస్తావేజు లేఖరులను సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లోకి నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఏపీలోని వైసీపీ సర్కారు తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు చెప్పింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి దస్తావేజు లేఖరులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దస్తావేజులను రాస్తూ వినియోగదారులకు సహాయపడుతూ తమ జీవనోపాధి సాగిస్తున్నామని దస్తావేజు లేఖరులు తమ పిటిషన్‌లో హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు... దస్తావేజు లేఖరులను సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లోకి నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి దస్తావేజు లేఖరుల ఎంట్రీకి హైకోర్టు మార్గం సుగమం చేసింది.