మొన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విషయంలో టీడీపీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ సర్కార్ తాజాగా ఆ విషయంలో ఇపుడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దీంతో ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించినట్లయింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా అవతరించింది. డీపీఐఐటీ (డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) జులై నెల నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఏడు నెలల వ్యవధిలో ఏపీ రూ.40,361 కోట్లు రాబట్టినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఏపీ తర్వాత రెండో స్థానంలో ఒడిశా నిలిచింది. ఒడిశా ఏడు నెలల కాలంలో రూ.36,828 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. దేశంలో పెట్టుబడుల విషయంలో ఈ రెండు రాష్ట్రాలది 45 శాతం అని డీపీఐఐటీ తెలిపింది. ఈ ఏడు నెలల వ్యవధిలో దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించింది.