ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీ తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోంది: టీడీపీ నేతల విమర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 12:27 PM

నీ తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోంది. రాష్ట్ర భవిష్యత్ నాశనమైపోతోందని టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. విశాఖలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, రాజధానిపై అసెంబ్లీలో చట్టం చేశాక ఇవాళ ఎందుకు మాట మార్చుతున్నారు? అంటూ వైసీపీ అధినాయకత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎందుకోసం ఇలా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. "ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్ పెద్దమనుషులు, ఇప్పుడు అరుస్తున్న పిచ్చికుక్కలు గత ఎన్నికల సమయంలో ఏం మాట్లాడారు? ప్రజలకు ఏం చెప్పారు? ఈ బొత్స సత్తిబాబు తదితరులందరూ కూడా మేం కూడా ఇక్కడే రాజధాని కడతాం అని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో ఉంది. అది మీ (పాత్రికేయులు) వద్ద కూడా ఉండే ఉంటుంది. 


డైమండ్ రాణి... ప్రస్తుత మంత్రి రోజా ఏం చెప్పింది? నమ్మండయ్యా బాబూ... మేం ఇక్కడే రాజధాని కడుతున్నాం, అందుకే మా బాసు ఇక్కడే ప్యాలెస్ కట్టుకున్నాడు అని రోజా చెప్పలేదా? దీనికి సంబంధించిన వీడియో మా దగ్గర లేదనుకుంటున్నారా? ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మళ్లీ మాటెందుకు మార్చావు? మడమెందుకు తిప్పావు జగన్ రెడ్డీ? అధికారంలోకి వచ్చాక బొత్స సత్తిబాబు రాజధానిని చూసి "ఇదొక ఎడారి" అంటాడు. ఇంకొక పనికిమాలిన మంత్రి "ఇదొక శ్మశానం" అంటాడు. ఎన్నికల ముందొక మాట, తర్వాత ఒక మాట ఎందుకు? ప్రజలను మోసం చేసి లబ్ది పొందాలని చూస్తున్నావు. 


నీ తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోంది. రాష్ట్ర భవిష్యత్ నాశనమైపోతోంది. నీ నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందా? ఇది నీ మూర్ఖత్వం కాదా జగన్ రెడ్డీ? అసెంబ్లీలో చట్టం చేసి, కోర్టు కూడా చెప్పినా వినిపించకుండా మూడు రాజధానులు అంటావేం? మళ్లీ మీ మంత్రెవడో నీకంటే పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు... జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం చేస్తాడంట! ఎలా చేస్తావయ్యా నువ్వు... నీకసలు చట్టాలు తెలుసా? గాలికి వచ్చిన వాళ్లు మీరు... చట్టాలపై మీకేం అవగాహన ఉంది? 


ఇక్కడే రాజధాని కట్టాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. కానీ ఇవాళ ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న నువ్వా రాజధాని కట్టేది? ఇది మంచిది కాదు జగన్ రెడ్డీ... నీకంటే మహామహులే కొట్టుకుపోయారు. ఓసారి చరిత్ర చూడు. చంద్రబాబు ఎంతో గొప్ప ప్రణాళికతో రాజధానికి రూపకల్పన చేస్తే మోకాలడ్డుతావా? 


రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల వద్దకు ఎప్పుడైనా వెళ్లావా? రైతు నాయకులను పిలిచి ఎప్పుడైనా మాట్లాడావా? నువ్వు ప్రజానాయకుడివా? రైతుల పట్ల బూతులు మాట్లాడడం, మహిళలను బూటు కాళ్లతో తన్నించడం చేశారు. ఇప్పుడా రైతులు అమరావతి నుంచి అరసవిల్లి పాదయాత్ర చేస్తుంటే దాన్ని కూడా వక్రీకరిస్తారా? ఒక పనికిమాలిన వాడు అంటున్నాడు... ఇది పాదయాత్ర కాదట... అమరావతి రైతులు ఉత్తరాంధ్రపై చేస్తున్న దండయాత్ర అట. ఈ మాట అనడానికి మీకు బుద్ధి ఉందా? స్పీకర్ తమ్మినేని మరీ ఘోరం. ఎన్టీ రామారావు, చంద్రబాబు హయాంలో మంత్రిగా చేసిన వ్యక్తివి నువ్వు. సీనియర్ నాయకుడివి అని చెప్పుకుంటావు, స్పీకర్ కుర్చీలో కూర్చున్నావు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే చెల్లదని చెబుతావా? అలా చెప్పడానికి సిగ్గుపడాలి. అది ఉన్మాదుల యాత్ర, దాన్ని అడ్డుకుంటాం అని అంటాడు. ఎలా అడ్డుకుంటావో చూస్తాం. స్పీకర్ స్థానంలో ఉండి ఎంత హుందాగా మాట్లాడాలి నువ్వు? ధర్మాన ప్రసాద్ కూడా ఇంతే. సీనియర్ నాయకుడివి అయ్యుండి కోర్టు తీర్పు గురించి మీకు తెలియదా.? ప్రజలను తప్పుదోవ పట్టించడం మీకు తగదు. పదవి రాకముందు ఒక మాట, పదవి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు" అంటూ అయ్యన్న వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa