అమరావతి రైతుల పేరుతో టీడీపీ నేతలు చేస్తున్నది పాదయాత్ర కాదని, దేవుడి దగ్గరకు వస్తున్న దెయ్యాల యాత్ర అని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.... జీవితంలో అసెంబ్లీలోకి రానని మంగమ్మ శపథం చేసాడు చంద్రబాబు. ఇక ఈ ఆఖరి రోజుల్లో అసెంబ్లీ సీటు కాదు కదా..గేటు కూడా టచ్ చేసే పరిస్థితి లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలోకి వస్తానన్నదే బాబు శపథం. మళ్లీ బాబు అధికారంలోకి రావడం అనేది ఒక కలే. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. దాంతో రాజకీయంగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ ఆస్కారం లేకపోవడంతో రాజధాని అంశాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు. అమరావతి రాజధానిగా ఉండదు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు కానీ ఎప్పుడూ చెప్పలేదు. అమరావతితో పాటు, విశాఖ, కర్నూలు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని భావించి 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారు అని తెలియజేసారు.