మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయటం తగదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి హితవు పలికారు. సీఎం జగన్ సతీమణి భారతిపై సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం డీజీపీని కలిసి లేఖను అందజేయడం తెలిసిందే.
గురువారం ఈ విషయం తెలిసి రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అభినందించేందుకు మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంకు తరలివచ్చారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాల మహిళలు వాసిరెడ్డి పద్మను దుశ్శాలువాతో సత్కరించి బొకే అందించారు. మిగతా ప్రాంతాలనుంచి పలువురు మహిళలు ఇదే వ్యవహారం పై వినతిపత్రాలు సమర్పించారు. వాటిని వాసిరెడ్డి పద్మ డీజీపీ కార్యాలయానికి పంపారు.