సోమశిల ముప్పువాసులు గత కొన్ని ఏళ్లుగా భూములను కోల్పోయి ఏ ఆధారము లేకుండా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో రైతులు జీవనం కొనసాగిస్తున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. పెన్నపేరూరులోని ముంపు వాసుల గురించి, ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధి గురించి సీఎం దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు.
ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సానుకూలంగా స్పందించారని అన్నారు. పెన్న పేరూరు గ్రామంలో భూములు కోల్పోయి ఏ ఆధారము లేకుండా జీవిస్తున్న వారిని అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ యువ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, గజ్జల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.