ఏపీ ప్రభుత్వం అప్పులను తీసుకొస్తున్న పరంపరను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంకు మంగళవారం చేపట్టిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొంది. ఈ వేలంలో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ రుణంతో ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23)లో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.49,600 కోట్లు అప్పుగా తీసుకున్నట్లైంది. రిజర్వ్ బ్యాంకులో ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం జరుగుతుంది. గత కొంతకాలంగా ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ వేలంలో పాలుపంచుకుంటూ ప్రతి వారం రూ.1,000 కోట్ల మేర రుణం సేకరిస్తోంది.
తాజా రుణంలో రూ.500 కోట్లను 12 ఏళ్ల కాల వ్యవధికి 7.71 శాతం వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంది. ఆరేళ్ల కాల వ్యవధికి గానూ 7.60 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్లను సేకరించింది. ఇప్పటికే కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్‌బీఎం పరిధిని దాటేసిన ఏపీకి ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు రుణాలు మినహా మరే ఇతర రుణాలు అందే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.