పీఏసీఎస్ సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగెట్టింది. ఏపీలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) సరికొత్త బాధ్యతలను చేపడుతూ దూసుకువెళుతున్నాయి. ఇప్పటిదాకా వ్యవసాయానికి రుణాలు, వ్యవసాయంలో యాంత్రీకరణ, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీకి మాత్రమే పరిమితమైన పీఏసీఎస్‌లు తాజాగా ఇంధన వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాయి.
ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ పరిధిలోని నగరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రాష్ట్రంలోనే తొలి సారిగా పెట్రోల్ పంపు నిర్వహణకు శ్రీకారం చుట్టనుంది. ఈ సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే ప్రారంభం కానున్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) పెట్రోల్ పంపునకు రోజా బుధవారం భూమి పూజ చేశారు.