ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు ఐఆర్ సీటీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో దసరా నవరాత్రుల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దసరా నవరాత్రుల సందర్భంగా రైలు ప్రయాణికులకు స్పెషల్ మెనూ అందించనుంది. దీనికి 'వ్రత్ మెనూ' అని నామకరణం చేసింది. ఇందులో అనేక సంప్రదాయక వంటకాలకు చోటిచ్చింది.
నవరాత్రుల సందర్భంగా చాలామంది మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉంటారు. ఉత్సవాలు ముగిసేంతవరకు వారు శాకాహారమే భుజిస్తారు. ఈ నేపథ్యంలో, ఐఆర్ సీటీసీ సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు వర్తించేలా 'వ్రత్ మెనూ'ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పలు రకాల పసందైర శాకాహార వంటకాలను అందించనున్నారు. ఈ స్పెషల్ మెనూ పొందాలనుకునేవారు 'ఫుడ్ ఆన్ ట్రాక్' ఆప్ లో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ecatering.irctc.co.in వెబ్ సైట్ ను సందర్శించడం కానీ, 1323 నెంబరుకు కాల్ చేయడం ద్వారా కానీ ఆర్డర్ చేయుచ్చని రైల్వే శాఖ వెల్లడించింది.