ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేరుగా చంద్రబాబే రావాని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలో ఎవరి హయాంలో ఏ మేర అభివృద్ధి జరిగిందన్న దానిపై తాను చర్చకు సిద్ధమన్న తమ్మినేని... తనతో చర్చకు టీడీపీ సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. అయితే ఈ చర్చకు అచ్చెన్నాయుడు లాంటి పానకంలో పుడకలు వద్దని... నేరుగా చంద్రబాబే చర్చకు రావాలని పిలుపునిచ్చారు. గుడ్డిగా విమర్శలు గుప్పించే వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని ఆయన ప్రశ్నించారు.
తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అగ్రికల్చర్ పాలిటిక్నిక్ కళాశాలను ప్రకటించింది. ఈ కళాశాలకు రాష్ట్ర మంత్రులు కాకాణి గోవర్థన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులు రేపు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమ్మినేని.. 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఏ పాటి అభివృద్ధి జరిగింది? వైసీపీ హయాంలో గడచిన మూడేళ్లలోనే ఉత్తరాంధ్రలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అన్న విషయంపై చర్చకు తాను సిద్ధమేనని ఆయన తెలిపారు. పథకాలకు పేర్లు మార్చే సంసృతికి టీడీపీనే శ్రీకారం పలికిందని తమ్మినేని ఆరోపించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు.