రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జోన్ ఏర్పాటుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖ జోన్ ఏర్పాటుపై పునరాలోచిస్తే కనుక ఆ విషయం చెబుతామని అన్నారు. ఇదిలావుంటే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెప్పిందంటూ కొన్ని పత్రికలలో కథనాలు రావడం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కుదరదని కేంద్రం అన్నట్టుగా వచ్చిన కథనాలను ఇప్పటికే రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు (బీజేపీ), విజయసాయిరెడ్డి (వైసీపీ) ఖండించారు. మీడియా అపోహలు సృష్టించే ప్రయత్నం చేయరాదని జీవీఎల్... మీడియాలోని ఓ వర్గం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరణతో ఈ అంశంలో స్పష్టత వచ్చినట్టయింది.