ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీ, టీడీపీ రెండూ పోటీపడి మరీ తమ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పీడు పెంచేశారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు... ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్ఠతపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల ఇంచార్జీలతో సమావేశం అయిన చంద్రబాబు... తాజాగా ఆ సంఖ్యను పెంచేశారు. గురువారం ఏకంగా 6 నియోజకవర్గాల ఇంచార్జీలతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు.
విజయవాడ తూర్పు, చీపురుపల్లి, రాయదుర్గం, సాలూరు, యర్రగొండపాలెం, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జీలతో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. గురువారం నాటి సమావేశాలతో చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలోని 71 నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జీలతో భేటీ అయినట్టయింది. మరికొన్ని రోజుల్లోనే ఆయన మిగిలిన నియోజకవర్గాల ఇంచార్జీలతో సమావేశాలను పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.