విశాఖ శ్రీ శారదాపీఠం శరన్నవరాత్రి మహోత్సవాలలో విశిష్టంగా వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారు శుక్రవారం లలితా త్రిపురసుందరి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. అలంకార భట్టర్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. లలితా త్రిపురసుందరి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు హారతులిచ్చి పూజలు చేసారు. మరోపక్క ప్రముఖ వేద పండితులు పీఠ ప్రాంగణంలో సంపూర్ణ వేద పారాయణ చేపట్టారు. చతుర్వేదాలతో పాటు యజుర్వేద క్రమ పారాయణ చేస్తున్నారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని, సర్వ జనులకు అభీష్ట సిద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ పారాయణ మహా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేదాల్లో నిక్షిప్తమైన 60 పన్నాలు, ఏడు కాండలను చదువుతున్నారు. 15 మంది వేద పండితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమి పర్వదినం వరకూ ఈ పారాయణ కొనసాగుతుంది.