చైనా అధ్యక్షుడి వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధంలో ఉంచిందని, అధికారాన్ని హస్తగతం చేసుకుందంటూ ఇటీవల వార్తలు హోరెత్తాయి. ఈ విషయంలో చైనా అధికారిక మీడియా ఎలాంటి ప్రకటన చేయకున్నా.. సోషల్ మీడియా మాత్రం కోడై కూసింది. అంతేకాదు, బీజింగ్‌ను సైన్యం చుట్టిముట్టిందంటూ వీడియోలు కూడా బయటకొచ్చి హల్‌చల్ చేశాయి.
ఇంత ప్రచారం జరిగినా చైనా మీడియా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఈ ప్రచారం ఇలా జరుగుతుండగానే రెండు రోజుల క్రితం రాజధాని బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జిన్‌పింగ్ పాల్గొన్నట్టు చూపుతూ అక్కడి అధికారిక మీడియా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఫలితంగా జిన్‌పింగ్ గృహనిర్బంధం వార్తలు అన్నీ ఉత్తవేనంటూ తేల్చి పడేశారు.
అయితే, ఆ ఫొటోలు వెలుగులోకి వచ్చిన కాసేపటికే మళ్లీ ఈ వ్యవహారం మొదటికి వచ్చింది. ఆ ఫొటోలు ఫేక్ అని పలువురు కొట్టిపడేస్తున్నారు. చైనా అధికారిక మీడియా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లో ఉన్నది అసలు సిసలైన ఒరిజినల్ జిన్‌పింగ్ కాదని, ఆయన డూప్ అని చెబుతున్నారు. ఇంకొందరేమో అవి పాత ఫొటోలని కొట్టిపడేస్తున్నారు.
ఇక ఆ ఫొటోల్లో జిన్‌పింగ్ కుడి చెవి, గొంతు భాగాల్లో తేడాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు, ఒరిజనల్ జిన్‌పింగ్‌తో పోలిస్తే ఫొటోల్లో కనిపించిన వ్యక్తి వయసు దాదాపు పదేళ్లు తక్కువగా ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా అవి ఫేక్ ఫొటోలు, వీడియోలేనని తేల్చి చెబుతుండడంతో జిన్‌పింగ్ గృహ నిర్బంధం అంశం మరోమారు తెరపైకి వచ్చింది.