కేరళకు చెందిన ఇద్దరు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి 11. 6 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వై. ఎస్. ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేసి వై. ఎస్. ఆర్ జిల్లా సిద్దవటం మండలం కనుమలోపల్లి మీదుగా వెళ్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
గంజాయి విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, పి. డి చట్టం ప్రయోగిస్తాం అని జిల్లా ఎస్. పి హెచ్చరిక చేశారు. ప్రజలు గంజాయి అక్రమ రవాణా, వినియోగించే వారి వివరాలకు సంబంధించిన సమాచారం తన ఫోన్ నెంబర్ 94407 96900 కు అందించాలని సూచించారు. గంజాయికి అలవాటు పడ్డ వారిని తిరిగి మామూలు మనిషిగా మార్చేందుకు వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తాం అని ఎస్. పి తెలిపారు. జిల్లా అదనపు ఎస్. పి (అడ్మిన్)తుషార్ డూడి పర్యవేక్షణలో స్మగ్లర్లను అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్న కడప డి. ఎస్. పి బి. వెంకట శివారెడ్డి, చిన్నచౌకు సి. ఐ అశోక్ రెడ్డి, సిద్దవటం ఎస్. ఐ తులసి నాగ ప్రసాద్, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను ఎస్పీ అందజేశారు.