ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టుల వార్నింగ్...వైసీపీలో కలవరంం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 04:15 PM

మావోయిస్ట్ పార్టీ నేతలు వార్నింగ్ ఇవ్వడంతో వైసీపీ పార్టీలో కలవరం మొదలైంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ, ప్రజల భూములను ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదల చేశారు. అధికార బలంతో అరాచకాలు సృష్టిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల్ని 'మన ప్రాంతం నుండి తన్ని తరిమి వేయాలి' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.


మావోల లేఖలో ‘అవినీతి, అక్రమాలతో వేల కోట్ల రూపాయలను పోసేగుకొని పుట్టినదే వైఎస్సార్‌సీపీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి గత మూడేళ్లుగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రజల భూములను ఆక్రమించుకోవడం ఒక విధానంగా మారిపోయింది. మూడు రాజధానుల పేరుతో తన అశ్రితులకూ, పార్టీ నాయకులకూ, రియలెస్టేట్ వ్యాపారులకు దోచిపెట్టడానికి విశాఖ నగర చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో కూడా నూతన జిల్లా కేంద్రాలలో ప్రజల భూములను వైఎస్సార్‌సీపీ నేతలు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్నారు. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను కూడగట్టుకున్నారు.. శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, రామకృష్ణాపురంలో సర్వేనంబర్ 143/1లో గతంలో ప్రజలు పోరాడి సాధించుకున్న 30 ఎకరాల విలువైన భూములతోపాటు, దాని చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను కూడా వైఎస్సార్‌సీపీ నేతలు దువ్వాడ శ్రీధర్, మంత్రి సీదిరి అప్పలనాయుడు, ఓ ఎంపీ కలిసి ఆక్రమించుకొని ఒక కార్పొరేట్ కంపెనీకి వేలకోట్ల రూపాయలకు ధారదత్తం చేస్తున్నారు’అంటూ లేఖలో ప్రస్తావించారు.


‘ఈ దురాక్రమణకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలు పోరాడుతున్నా, అధికార బలంతో పోలీసు, రెవిన్యూ డిపార్ట్మెంట్ల అండదండలతో ప్రజలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ప్రాంత పరిధిలో కాశిబుగ్గ - పలాస జంట పట్టణాలకు అందుబాటులో ఉన్న సూదికొండ - నెమలికొండలు నేడు అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకొని కోట్ల రూపాయల విలువ చేసే మట్టినీ, రాళ్ళను యథేచ్చగా అమ్ముకుంటున్నారు. దాంతో తీవ్రంగా పర్యావరణం దెబ్బతిని నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, విశాఖ ఆంధ్ర యూనివర్సీటీ భూములను కబ్జా చేయడంలో భాగంగా యూనివర్సిటీ ఆవరణ ప్రాంతంలో అరాచక కార్యకలాపాలు (వ్యభిచార) జరుగుతున్నాయని వాళ్ళ ఆటలు కట్టడి చేయడంలో భాగంగా చర్యలు చేపడుతున్నట్లు ప్రచారం చేసి పచ్చగా ఉన్న వందలాది చెట్లను నరికివేసి బుల్ డోజర్తో చదును చేయించారు. పర్యాటక ప్రాంతమైన రుషికొండపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి అనేక అక్రమాలకు పాల్పడుతూ వస్తుందని,ఈ అక్రమాలను ఎవ్వరు ప్రశ్నించవద్దని ఏపీటీడీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు’ అన్నారు.


‘టూరిజం పేరుతో అరకు ప్రాంతంలో అటవీ, రైతుల వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని రిస్టార్స్ నిర్మిస్తున్నారు. ఏపీఎఫ్ సీ కాఫీ ప్లాంటేషన్ల విస్తరణలో భాగంగా రైతులు పోడు భూములను దురాక్రమిస్తుంది. లాటరైట్ పేరుతో వేలాది ఎకరాల అడవులను ధ్వంసం చేయడంతోపాటు వాటి సరఫరాకు నాలుగు లైన్ల రోడ్లను నిర్మించి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. అరకులోయ మండలం, మాడుగుల గ్రామంలో ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ 'గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తమ భూమి ఆక్రమణపై ఎమ్మెల్యేలను నిలదీసిన గిరిజన కుటుంబంపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. పైన చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు, దోపిడీ, దైర్జన్యాలు సర్వసాధారణ అంశంగా మారిపోయాయి. పై దోపిడీ, ధైర్జన్యాలకు వ్యతిరేకంగా ఎవ్వరు గొంతు విప్పినా జైళ్ళపాలు కావాల్సిందే..? ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులనూ, ఆస్తులను పాలకవర్గాలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న నేటి తరుణంలో ఆ పోరాట ఫలితాలను నిలుపుకోవడానికి పోరాటం, ప్రతిఘటన తప్ప మరో మార్గం లేదు. అధికారబలంతో అరాచకాలు సృష్టిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను మన ప్రాంతం నుండి తన్ని తరిమి వేయాలి. గత పోరాట చరిత్రను నెమరవేసుకుంటూ భవిష్యత్ పోరాటానికి సిద్ధం కావాలి. దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు తమ అండదండలు అందించాలని సీపీఐ (మావోయిస్టు) ఏఓబీ ఎస్‌జెడ్‌సీ పిలుపునిస్తుంది’అన్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa