వైసీపీ రాష్ట్ర పాలనకు నిదర్శనంగా కేంద్రం పలు అంశాల్లో ఏపీకి అవార్డులు అందించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీ ఏకంగా 11 అవార్డులను గెలుచుకుంది. రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఈ అవార్డులు రాగా... ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయా పురపాలికల అధికారులు, ప్రజా ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. వాటిని తీసుకుని 11 పురపాలికలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు శుక్రవారం తాడేపల్లి వచ్చారు. అవార్డులను పట్టుకుని వారంతా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
అధికారుల చేతుల్లోని అవార్డులను చూసి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఏడాది రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 11 అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, భవిష్యత్తుల్లో రాష్ట్రానికి మరిన్ని అవార్డులు తీసుకుని రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.