''ఆడపిల్లలను చదివించడమంటే మొత్తం కుటుంబాన్ని చదివించడమే.''.. ''వితంతువుల కోసం, అనాథల కోసం కష్టపడే వ్యక్తి పగలంతా ఉపవాసం ఉండి, రాత్రుల్లో ఆరాధనల్లో గడిపిన వ్యక్తితో సమానం.''.. ''భార్య నోటికి ఒక ముద్ద అందించడం కూడా పుణ్యకార్యమే'' ఇలా వందల ఏళ్ల క్రితం ఇలాంటి అభ్యుదయ భావాలను బోధించే సాహసం ఎవరైనా చేయగలరా? చేయలేరనే అనిపిస్తుంది. కానీ చీకటిని చీల్చే సూర్యుడిలా ఉదయించి మానవాళికి మార్గ నిర్దేశం చేసిన ప్రవక్త ఒకరు ఉన్నారు. ఆయనే ముహమ్మద్(స).
ముహమ్మద్ (స) క్రీ.శ.571, ఏప్రిల్ 20న మక్కా నగరంలో జన్మించారు. ఆయన పుట్టక ముందే తండ్రి చనిపోయారు. ఆరేళ్ల వయస్సులో తల్లిని కోల్పోయారు. ఎడారిలో కఠినమైన పరిస్థితుల్లో ముహమ్మద్ ప్రవక్త పెరిగారు. ప్రకృతికి దగ్గరగా జీవించారు. యుక్త వయస్సులో పశువుల కాపరిగా పనిచేశారు. ఆ సమయంలో ఒంటరితనాన్ని, సహనాన్ని, ధ్యానాన్ని, అప్రమత్తతను అలవరచుకున్నారు. ఆ తర్వాత వ్యాపారిగా మారారు. చెడు అలవాట్లు, ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. చిన్ననాటి నుంచే ఆయనలో ఆధ్యాత్మిక భావాలు, తాత్విక చింతన ఉండేవి. పరులకు తన చేతనైన సాయం చేసేవారు. ఈ సుగుణాలతో అరబ్బు ప్రజల మన్ననల్ని పొందారు. దైవ ప్రవక్తగా తన సందేశాన్ని అందించడంలో సఫలమయ్యారు.
ముహమ్మద్(స) ప్రవక్త తాను చెప్పాలనుకున్న ఆదర్శాలను ఆచరించి చూపేవారు. ఆ రోజుల్లో ఆరేబియా, ఇతర దేశాల్లో మహిళల స్థితిగతులు దారుణంగా ఉండేవి. వితంతువులు మోడు వారిన చెట్టులా జీవితాన్ని గడిపేవారు. ఈ నేపథ్యంలో ముహమ్మద్ ప్రవక్త వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని చెప్పి, తాను స్వయంగా 40 ఏళ్ల వితంతు మహిళ ఖదీజా(రజి)ను వివాహం చేసుకున్నారు. భార్యలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని ప్రవక్త ప్రవచించారు. తన భార్య తాగిన ఎంగిలి పాత్రలోనే ఆయన తాగేవారు.
ఇంటి పనుల్లో భార్యకు సాయం చేసేవారు. భర్తలపై భార్యలకు కొన్ని హక్కులు ఉంటాయని ప్రవక్త స్పష్టం చేశారు. భార్యలో లోపాలు వెతక్కుండా ఆమెలో నచ్చిన అంశాలను తలచుకుని హాయిగా దాంపత్య జీవితం గడపాలని ప్రవక్త భర్తలకు సూచన చేశారు. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని, వారు ముసలివారైతే సేవలు చేయాలని ప్రవక్త బోధించారు.
ఇరుగు పొరుగువారితో ఎలా మెలగాలి, ఇతర మతస్థులతో ఎలా ఉండాలి... ఇలా అనేక విషయాలపైనా ముహమ్మద్ ప్రవక్త స్పష్టమైన సందేశాలు ఇచ్చారు. ఇరుగుపొరుగు వారితో స్నేహం చేసి వాళ్ల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటే అందరికీ ఆనందం, ఆరోగ్యం కలుగుతాయని ఆయన బోధించారు. పొరుగువారు రుణం అడిగితే మీ శక్తి కొద్దీ రుణ సాయం చేయమని బోధించారు. ఇంట్లో వండిన ఆహారం పొరుగువారితో పంచుకొమ్మని సలహా ఇచ్చారు. సేవకుల పట్ల దయా గుణం కలిగి ఉండాలని ప్రవక్త ప్రవచించారు. ఒకసారి తన సేవకుడు జ్వరంతో బాధ పడుతున్నాడని తెలిసి, అతడిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి, అతడు చేయాల్సిన పనిని తానే చేశారు. అనాథలను సంరక్షించే వ్యక్తికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడని ప్రవక్త అన్నారు.
మహమ్మద్ ప్రవక్త ఎంతో భూత దయ కలిగి ఉండేవారు. ఒకసారి ఒక బక్కచిక్కిన ఒంటెపై చాలా బరువు వేసి వెళుతున్న వ్యక్తిని చూసి కోప్పడ్డారు. పరిశుభ్రత ప్రాధాన్యతను కూడా ప్రవక్త నొక్కి చెప్పేవారు. ప్రళయం వస్తున్నా చేతిలో ఒక మొక్క ఉంటే దాన్ని నాటమని సూచించారు. ప్రజలు నడిచే దారిలో ముండ్లను తీసి వేయడం కూడా దైవారాధనతో సమానమ్నారు.
తనను హత్య చేయాలని ప్రయత్నించిన వారిని క్షమించిన దయార్ధ హృదయుడు మహమ్మద్ ప్రవక్త. ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ తన కోపాన్ని అదుపు చేసుకున్న వ్యక్తికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడని ఆయన బోధించారు. మహమ్మద్ ప్రవక్త(స) ఇచ్చిన విప్లవాత్మక నినాదం - లా యిలాహ ఇల్లల్లాహ్ - ఇది చిన్న నినాదమైనా బలమైన నినాదం. అల్లాహ్(దేవుడు) తప్ప మరో ఆరాధ్యుడు లేడనేది దీని అర్థం. రాగ ద్వేషాలకు అతీతుడైన ఆయనకు మానవులంతా విధేయత చూపాలని ప్రవక్త తెలిపారు. మానవులంతా అల్లాహ్‌నే ఆరాధించాలని చెప్పారు. ఈ విధంగా మానవాళికి ఎన్నో సుభాషితాలు అందించిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త . ఆయన బోధనలు నిత్యం అనుసరణీయం. అందుకే ఆయన ప్రవచనాలు మానవాళికి మార్గదర్శకాలు. ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్ (సఅసం) గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? టోల్ ఫ్రీ నెంబరు 1800 572 3000 కు ఫోన్ చేసి ఉచిత పుస్తకాన్ని పొందగలరు.