ఇటీవల పలు పథకాలలో వాలంటీర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్న ఘటనలు మన ముందుకు వస్తున్నాయి. అమ్మఒడి నిధులను పక్కదారి పట్టించి, స్వాహా చేసిన వాలంటీర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సచివాలయం పరిధిలో అమ్మఒడి నిధుల్లో గోల్‌మాల్‌కు పాల్పడిన 9 మంది వాలంటీర్లను తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 40 మంది విద్యార్థులకు సంబంధించిన నిధుల గల్లంతులో 9 మంది వాలంటీర్ల ప్రమేయం ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. నిధుల గల్లంతుపై గతంలో సచివాలయ అధికారినిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఈ నిధులను అనర్హుల ఖాతాలకు జమ కావడంలో తొమ్మిది మంది వాలంటీర్ల ప్రమేయం ఉన్నట్టు తేలింది. 44 మంది అనర్హుల ఖాతాలకు మొత్తం రూ.5.72 లక్షలు జమ అయినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు విచారణ జరిపి వాలంటీర్లనే బాధ్యులుగా గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో వి.శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. తల్లులకు తెలియకుండా వారి వేలిముద్రలను వాలంటీర్లు సేకరించి అప్‌లోడ్ చేసినట్టు ధ్రువీకరించారు. పిల్లలు లేనివారు, వితంతువులు కూడా అమ్మఒడి తల్లుల జాబితాలో గుర్తించామని ఎంపీడీవో పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలు బాధ్యత నుంచి పాఠశాల విద్యాశాఖను తప్పించి గ్రామ, వార్డు సచివాలయ విభాగానికి అప్పగించారు. దీంతో వాలంటీర్లు తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది అమ్మఒడి పథకం కింద రూ.6,594.60 కోట్లను మొత్తం 43,96,402 మంది తల్లులకు అందజేశారు. ఇందులో 54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.