ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజీరియాలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 76 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 01:33 PM

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. 85 మందితో వెళ్తున్న పడవ ఒగ్​బారూ ప్రాంతంలో వరదల కారణంగా ఒక్కసారిగా మునిగిపోవడమే ఇందుకు కారణం. పడవ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలు వెలికితీశారు.


ఈ దుర్ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. పడవలోని ప్రతి ఒక్కరి ఆచూకీ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని బాధితులకు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సంబంధిత అధికారుల్ని నైజీరియా అధ్యక్షుడు ఆదేశించారు.


కాగా, నదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని సహాయక సిబ్బంది తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరద ఉద్ధృతి ఉందని అధికారులు పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అనంబ్రా రాష్ట్ర గవర్నర్ చార్లెస్ సోలెడో మాట్లాడుతూ.. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారి కోసం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పడవ ప్రమాదాలు నైజీరియాలో సర్వసాధారణంగా మారాయి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వేగం, పేలవమైన నిర్వహణ వంటివి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఇక్కడ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 300 మందికిపైగా మరణించగా, లక్ష మందికిపైగా నిరాశ్రయులయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com