విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న వైసీపీ నగరంలో చేపట్టనున్న గర్జనకు పోటీగా తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించనున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మూడేళ్లలో ఉత్తరాంధ్రను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందీ, ఇక్కడ వనరులను నేతలు ఎలా దోచుకుంటున్నదీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వికేంద్రీకరణ పేరిట వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.