బెయిల్ మంజూరు విషయంలో ఎమ్మెల్సీ అంకబాబుకు పదేపదే నిరాశ ఎదురవుతోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు...అనంతబాబు అభ్యర్థనను తిరస్కరించింది. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని తన వెంట తీసుకెళ్లిన అనంతబాబు...అతడిపై తీవ్రంగా దాడి చేయగా సుబ్రహ్మణ్యం చనిపోయాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తర్వాత అనంతబాబుపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబు... ఇప్పటికే తనకు బెయిల్ ఇవ్వాలని రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా...కోర్టు అందుకు నిరాకరించింది.
ఈ క్రమంలో ఇటీవలే తన తల్లి మరణం నేపథ్యంలో కొంతకాలం పాటు బెయిల్ పొందిన అనంతబాబు హైకోర్టు ఆదేశాలతో జైలులో లొంగిపోయారు. అనంతరం ఆయన తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు నిర్ణీత వ్యవధిలోగా చార్జిషీట్ దాఖలు చేయలేదని అనంతబాబు వాదించారు. అయినా కూడా అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.