భారీ వర్షాలపట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి బుధవారం ఆదేశించారు. ఉత్తర తమిళనాడు ప్రాంతం వద్ద కేంద్రీకృతమైన తుఫాను కారణంగా, రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. విజయనగరంతోపాటు, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వెంటనే కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు.
విద్యుత్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయం, ఆర్ అండ్ బి, వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, పౌర సరఫరాలు, ఆర్‌టిసి, వివిధ ప్రాజెక్టు ఇంజనీర్లు, మున్సిపాల్టీలు, ఎంపిడిఓలు, తాశీల్దార్లను అప్రమత్తం చేశారు. మండలాల్లో ఎంపిడిఓలు, తాశీల్దార్లు తమ క్రింది స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలతోపాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి, అవసరమైన పక్షంలో సురక్షిత చోటికి తరలించాలన్నారు. చెరువులను పరిశీలించి, గండిపడే అవకాశం ఉన్న చోట ముందే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. రిజర్వాయర్లు, నదులు, చెరువుల్లోని నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని, తగిన చర్యలు తీసుకొనేందుకు అనుగుణంగా, సచివాలయ సిబ్బందికి పర్యవేక్షణ పెట్టాలని ఎంపిడిఓలను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా తగిన చర్యలు తీసుకొనేందుకు వీలుగా రక్షణ బృందాలను సిద్దం చేయాలని కలెక్టర్ సూచించారు.