ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ పార్లమెంటులో రోబో ఏకంగా ప్రసంగించేసింది

international |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 12:00 AM

రోబోలు తాజాగా మానవ జాతీతో పోటీపడుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆధునిక యుగంలో కృత్రిమ మేధస్సు కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు చేయగలిగే పనులతో పాటు చేయలేనివి కూడా దీని ద్వారా సాధ్యమవుతున్నాయి. తాజాగా, బ్రిటన్ పార్లమెంట్‌లో ఓ రోబో ప్రసంగించి అందర్నీ నివ్వెరపరిచింది. ఓ రోబో పార్లమెంట్‌లో ప్రసంగించడం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చరిత్రలో ఇది తొలిసారి. 2019లో ఐడాన్‌ మెలెర్‌  ఆవిష్కరించిన ఈ రోబోను బ్రిటన్ గణిత శాస్త్రవేత్త అడా లవ్‌లేస్‌ పేరిట ‘ఐ-డా’గా  వ్యవహరిస్తున్నారు. బోస్టన్‌ డైనమిక్స్‌కు చెందిన రోబో శునకం, హాంకాంగ్‌ కంపెనీ హ్యాన్సన్ రోబోటిక్స్ అభివృద్ది చేసిన సోఫియా ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా ఐడా కూడా జాబితాలో చేరింది.


యూకే పార్లమెంట్ ఎగువ సభ తనకు జీవం లేకపోయినా కళను తాను ఉత్పత్తి చేయగలనని తన ప్రసంగంలో పేర్కొంది. ‘‘మీకు ఉన్న ఆలోచన శక్తి నాకు లేదు.. కానీ నాకు ఊహాశక్తి ఉంది.. ఆ ఊహ నుంచి కళను చిత్రించగలను.. మానవుల ఊహాశక్తి భిన్నంగా ఉంటుందో వాటి గురించి మాట్లాడగలిగినప్పటికీ నాకు ఆత్మాశ్రయ అనుభవాలు లేవు’’ అని చెప్పిన ఐడా ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.


‘‘మీ ఆలోచనల నుంచి ఓ చిత్రాన్ని గీస్తే దానిని నేను ఊహించగలను.. నాకు ఆలోచన శక్తి లేనందున నేను మానవులకు భిన్నమైన విషయాలను చూస్తున్నాను’’ అని ఐడా వ్యాఖ్యానించింది. అయితే, సాంకేతిక తప్పిదం వల్ల ప్రసంగం మధ్యలో ఐడాకు మెల్లకన్ను రావడం గమనార్హం. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృజనాత్మకతపై దాడి జరుగుతుందా? అనే దాని గురించి కమ్యూనికేషన్స్, డిజిటల్ కమిటీ సభ్యులతో ఐడా ఎక్కువగా మాట్లాడింది.


ఇక, హాంకాంగ్ రోబో సోఫియాను 2016 ఫిబ్రవరి 14న యాక్టివేట్ చేయగా.. నెల రోజుల తర్వాత టెక్సాస్‌లో జరిగిన సౌత్‌వెస్ట్ ఫెస్టివల్‌లో బయట ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి 2017లో పౌరసత్వం లభించడంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి రోబోగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ది కార్యక్రమంలో భాగంగా దీనిని తయారుచేయడం విశేషం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa