విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజలు శనివారం చేపట్టనున్న విశాఖ గర్జనకు జిల్లాలోని పార్టీ ముఖ్య శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించేలా నిర్వహిస్తున్న గర్జనకు ఆయా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల భాగస్వామ్యంతో పార్టీ ఆఫీస్ బేరర్లు, సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పిటిసిలు మొదలుకొని అన్ని స్థాయిల నాయకులు హాజరుకావాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని గట్టిగా ప్రశ్నించే సమయం ఇదేనని అన్నారు. మన ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహిస్తున్న విశాఖ గర్జనతో ఉత్తరాంధ్ర వాణిని దేశం మొత్తం వినిపించాలని కృష్ణ దాస్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.