ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు అప్పుల భారం పెరిగిపోతోందని.. అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే రుణ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్ పాస్రు. రుణాలు, అధిక వడ్డీల కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని వివరించారు. ఇవన్నీ పెద్ద సవాళ్లుగా పరిణమించాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, వచ్చే ఏడాది మాంద్యం తరహా పరిస్థితులు ఏర్పడవచ్చని ఆయన హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో... 2023 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 3 శాతం నుంచి 1.9 శాతానికి కుదించామని చెప్పారు. ఈ పరిస్థితుల వల్ల పేదల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని.. పేదలను ఆదుకునే చర్యలు చేపట్టాలని దేశాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ప్రమాదం ఉన్నా.. ఒక్కో దేశంలో ఒక్కో తరహాలో సమస్య ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్ పాస్ పేర్కొన్నారు. ఆయా దేశాలను బట్టి ఏం చేయాలనేది పరిశీలిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, పెట్టుబడుల కోత వంటి సమస్యలు పేదలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టినట్టు వివరించారు.