మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై కీలక అప్డేట్ వచ్చింది. జనవరి 28వ తేదీన బారామతిలో జరిగిన ఈ విషాదకర ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఫిబ్రవరి 28లోపు విడుదల చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఆదివారం స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం దర్యాప్తు..
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) నిబంధనల ప్రకారం.. విమాన ప్రమాదం జరిగిన 30 రోజుల్లోపు ప్రాథమిక నివేదికను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు జనవరి 28న ప్రమాదం సంభవించినందున.. ఫిబ్రవరి 28 నాటికి నివేదిక సిద్ధం అవుతుందని మంత్రి తెలిపారు. విమాన శకలాలు, ఆపరేషనల్ రికార్డులు, మెయింటెనెన్స్ వివరాలను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) శాస్త్రీయంగా పరిశీలిస్తోందని ఆయన వివరించారు.
బ్లాక్ బాక్స్ డేటా సేకరణ
ప్రమాదానికి గురైన లియర్‌జెట్ 45 (వీటీ-ఎస్ఎస్కే) విమానంలో రెండు కీలక రికార్డర్లు ఉన్నాయి. న్యూఢిల్లీలోని ఏఏఐబీ ఫెసిలిటీలో దీని డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు. అయితే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ మాత్రం పాక్షికంగా దెబ్బతినడంతో.. సాంకేతిక సహాయం కోసం విమాన తయారీ సంస్థ 'హనీవెల్' నిపుణులను సంప్రదించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై అజిత్ పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సదరు ప్రైవేట్ విమానయాన సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ భద్రతా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిందని ఆయన విమర్శిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సదరు సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రత్యేక ఆడిట్‌ను చేపట్టింది. విమాన సిబ్బంది శిక్షణ, నిర్వహణ పద్ధతులు మరియు భద్రతా వ్యవస్థలపై ఫిబ్రవరి 4 నుంచి సమగ్ర విచారణ సాగుతోంది.
ఊహాగానాలను అస్సలే నమ్మవద్దు..
విచారణ సాగుతున్న తరుణంలో ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తి అయ్యాక నివేదికను బహిర్గతం చేస్తామని స్పష్టం చేసింది. రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఈ దర్యాప్తు నివేదిక ఎలాంటి సంచలన విషయాలను బయటపెడుతుందోనని యావత్ మహారాష్ట్ర ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa