ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 20సార్లు తప్పించుకున్న జైషే ఉగ్రవాది సహా ముగ్గురు హతం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 07:36 PM

జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కిష్టావర్‌‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో మోస్ట్ వాంటెడ్ జైషే మహమ్మద్ ఉగ్రవాది సైఫుల్లాహ్‌ సహా ముగ్గురు ముష్కరులు హతమైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో గత రెండేళ్లుగా అతడు పరారీలో ఉన్నాడని, 20సార్లు సైన్యం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడని పేర్కొన్నాయి. కిష్టావర్‌లోని ఛత్రూ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మట్టి ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది.


భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలిలో రెండు అసాల్ట్ రైఫిల్స్, సప్లయ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జైషే మహమ్మద్‌కు చెందిన మరో ఉగ్రవాది అదిల్‌ను ఇటీవల సైన్యం ఇదే ప్రాంతంలో హతమార్చింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇంకా, ఆపరేషన్ కొనసాగుతున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి.


పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ టాప్ కమాండర్లలో ఒకడైన సైఫుల్లాహ్.. కరడుగట్టిన ఉగ్రవాది. దాదాపు ఐదు సంవత్సరాల కిందట జమ్మూ కశ్మీర్‌లోకి అతడు చొరబడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి స్థానికంగా సైఫుల్లా యాక్టివ్‌గా ఉన్నాడు. జులై 2024లో నలుగురు జవాన్లు మరణానికి కారణమైన దాడి సహా అనేక దాడుల్లో ప్రధాన సూత్రధారి ఇతడే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు సైనిక ఎన్‌కౌంటర్‌ల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. కాగా, సైఫుల్లాహ్ సహా ఈ ఏడాది ఇప్పటివరకు ఏడుగురు జైషే ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.


ఇదిలా ఉండగా, ఛత్రూ బెల్ట్ అటవీ ప్రాంతంలో గత నెల రోజులుగా దాదాపు అర డజను ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ త్రాషి-1ను సైన్యం ప్రారంభించింది. ఛత్రూ, సోన్నార్, డోల్గామ్, దిఛార్ సహా కిష్టావర్ అటవీ, పర్వత ప్రాంతాల్లో సవాళ్లను ఎదుర్కొడానికి ఆపరేషన్ త్రాషి-1ను చేపట్టి విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa