తమ భూ సమస్య పరిష్కారం చేయలేదని అధికారుల తీరుకు నిరసనగా ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మేనల్లుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వాసు నిప్పు పెట్టుకునేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన వాసు కుటుంబ సభ్యులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆయనను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లెలో వాసు కుటుంబం నివాసం ఉంటోంది. 1986లో వాసు తండ్రి ఈశ్వరయ్య పేరిట గ్రామ పరిధిలో 5 ఎకరాల భూమికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అయితే ఈశ్వరయ్య కుటుంబానికి తెలియకుండానే ఆ పట్టాను రద్దు చేశారట. ఈ విషయాన్ని తెలుసుకున్న వాసు తిరిగి ఆ భూమిని తమ కుటుంబం పేరిట తిరిగి పొందారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. కోర్టులో ఈ వివాదం పరిష్కారం కాకుండానే ఆ స్థలాన్ని గ్రామస్తులు శ్మశానంగా మార్చే యత్నం చేశారని వాసు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై వాసు ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుంచి తనకు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. తమ కుటుంబానికి చెందిన పొలం పూర్తిగా ఎక్కడ శ్మశానంగా మారిపోతుందోనని ఆయన గత కొంతకాలంగా ఆవేదన చెందున్నారు. ఈ క్రమంలోనే తన పొలాన్ని దక్కించుకునేందుకు ఆయన తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించారు. ఇకనైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.