ఓ వైపు అధికార వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన... మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలతో విశాఖ నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఆదివారం ఉదయమే జేఏసీ నేతలు బరిలోకి దిగారు. పవన్ బస చేసిన నోవాటెల్ నుంచి కళావాణి ఆడిటోరియానికి దారి తీసే మార్గంలో ఈ ప్లకార్డులు పట్టుకుని జేఏసీ నేతలు నిరసనకు దిగారు. అంతేకాకుండా గో బ్యాక్ పవన్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను కూడా జేఏసీ నేతలు ప్రదర్శించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని నిరసనకు దిగిన జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.