జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేస్తామని, ఈ దిశగా న్యాయ నిపుణులతో చర్చిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గత మూడ్రోజులుగా విశాఖపట్నంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో న్యాయపోరాటం చేసేందుకు పవన్ కల్యాణ్ విశాఖ నుంచి మంగళగిరి పయనమయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ భవిష్యత్ చర్యలపై న్యాయనిపుణులతో చర్చించనున్నారు. దీనిపై ఆయన ఓ వీడియో సందేశం వెలువరించారు. తమ పార్టీకి చెందిన 115 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని, దీనిపై తమ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ చైర్మన్ సాంబశివ ప్రతాప్ తో చర్చిస్తామని పవన్ వెల్లడించారు. ఇప్పటికే కొంతమందికి స్టేషన్ బెయిల్ వచ్చిందని, మిగతావారికి కూడా బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తమ పోరాటం ప్రభుత్వంపైనే తప్ప పోలీసులపై కాదని మనస్ఫూర్తిగా చెబుతున్నానని స్పష్టం చేశారు.
హోటల్ బయట తనకోసం చాలామంది వేచిచూస్తున్నారని, వాళ్లందరికీ అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేస్తామని, ఈ దిశగా న్యాయ నిపుణులతో చర్చిస్తామని వివరించారు. హైకోర్టులోనూ పిటిషన్ వేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయని తెలిపారు. ఇదిలావుంటే మంగళగిరి బయల్దేరే ముందు పవన్ కల్యాణ్... విశాఖలో విడుదలైన జనసేన నేతలను పరామర్శించారు.