పాముకాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శృఃగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలం పెద కృష్ణరాజపురం గ్రామానికి చెందిన డోల రామకృష్ణ అనే వ్యక్తి మంగళవారం తన వరి చేనుకు యూరియా పిచికారి చేసేందుకు పొలంలోకి వెళ్తున్న నేపథ్యంలో పొలం గట్టుపై పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు రామకృష్ణను హుటాహుటిన వైద్య చికిత్స నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామకృష్ణకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విశాఖపట్నం తీసుకువెళ్లాలని వైద్యులు సూచించడంతో రామకృష్ణను విశాఖపట్నం తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేపాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.