రాష్ట్రంలోని వాల్మీకి, బోయ, బెంతు ఒరియాల సామాజిక స్థితిగతులపై అధ్యయనానికి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ సామాజిక వర్గాల స్థితిగతులపై 3 నెలల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను బీసీల జాబితా నుంచి ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ డిమాండ్ సాధ్యాసాధ్యాలు, ఆయా సామాజిక వర్గాల స్థితిగతుల ఆధారంగా ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలపై అధ్యయనం చేసేందుకే ప్రభుత్వం ఈ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా వీరిని ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.