జనసేన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఆయన గురువారం నరసన్నపేట, తామరపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ గర్జనను ఎలాగైనా భగ్నం చేయాలని పవన్ కళ్యాణ్, అతని అనుచరులు విఫలయత్నం చేశారని, తర్వాత ఎక్కడో చెప్పులు తీస్తానని మాట్లాడటం అతని దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. 'చెప్పులు మీ దగ్గరే కాదు మా దగ్గర కూడా కోట్లాది చెప్పులున్నాయి' ఆ విషయాన్ని పవన్ గుర్తుపెట్టుకోవాలన్నారు. అనూహ్య ప్రజా స్పందనని దారి మళ్లించాలనే కుయుక్తులతో అదే రోజు పవన్ని చంద్రబాబునాయుడు విశాఖపట్నం పంపారని అన్నారు. చంద్రబాబునాయుడు ఎందుకు విశాఖ గర్జన నాడు వైజాగ్ రాలేదని ప్రశ్నించారు. వారి అనుచరులతో తమ మంత్రి మీద దాడి జరిపిస్తే జైల్లో వేయకుండా సన్మానాలు చేస్తారా? అని అన్నారు.
పూటకో మాట చెప్పుకుంటూ కక్షాపూరితంగా వ్యవహరిస్తూ, దౌర్జన్యాలతో, రాజకీయంగా ఘర్షణలు పడుతూ ఎవరూ వృద్ధిలోకి రాలేరని అన్నారు. పవన్ కళ్యాణ్ లో సమర్ధత ఉంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట కూడా ఎందుకు గెలవలేకపోయారని అన్నారు. గాజువాక, భీమవరాల్లో పోటీచేసినా ఎక్కడా ప్రజలు అతన్ని గుర్తించలేదన్నారు. రాజకీయాల్లో నిలకడలేని తనానికి పవన్ కళ్యాణ్ నిదర్శనమన్నారు. ఒకరోజు బిజెపి, మరో రోజు టిడిపి అంటూ నిలకడలేని మాటలు చెబుతుండటం అతనికే చెల్లిందన్నారు. సొంతంగా పార్టీని నడిపించలేక ఎవరికో ఒకరికి తోక పార్టీగానే మిగిలిపోతూ తన స్థాయిని మరిచి పవన్ స్టేట్మెంట్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ విజ్ఞత ఉండే మాట్లాడుతున్నారా? అన్నారు. జనం ఎప్పటికీ పవన్ కళ్యాణిని నమ్మరని ప్యాకేజీ నాయకుడని అంతా గుర్తించేశారని అన్నారు. పవన్ కళ్యాణ్కు తనదైన స్వతంత్ర వ్యక్తిత్వం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని, వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతుంటే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ల తీరు అర్ధరహితంగా ఉందని, మరోసారి వీరికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.