కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం ఎన్ఆర్ఐ టీడీపీ USA సభ్యులు రూ.15 లక్షలు సాయంగా అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేతుల మీదుగా బాధితురాలి తండ్రికి శుక్రవారం అందజేశారు. వివరాల్లోకి వెళ్ళితే ... కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ సభ్యుడు గాజుల మురళీకృష్ణ కుమార్తె లాస్య కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దానిపై స్పందించిన లోకేశ్ సూచన మేరకు కోమటి జయరామ్ ఆధ్వర్యంలోని అమెరికాలోని టీడీపీ సభ్యులు ఔదార్యంతో రూ.15 లక్షలు సమీకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో లోకేశ్ చేతుల మీదుగా మురళీకృష్ణకు అందజేశారు. టీడీపీ కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్న ఎన్ఆర్ఐ టీడీపీ USA సభ్యులను లోకేశ్ ఈ సందర్భంగా అభినందించారు. టీడీపీ సీనియర్ నేత, అవనిగడ్డ టీడీపీ ఇన్చార్జి మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.