పారిశ్రామిక రంగంలో అనకాపల్లిని మొదటి స్థానంలో నిలుపుతానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఆదివారం అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో సుమారు 60 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో వున్నప్పటికీ గత ప్రభుత్వాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. దీనికి ఆనుకొని మరో 70 ఎకరాల్లో ఇండస్ర్టియల్ పార్కు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి మాట్లాడుతూ, పారిశ్రామిక రంగంలో అనకాపల్లిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి ఎంఎస్‌ఎంఈ పార్కు ఎంతో దోహదపడుతుందని అన్నారు. స్థానిక ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ నదియా, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ భీశెట్టి వరహా సత్యవతి, వైసీపీ నాయకులు శ్రీధర్‌రాజు, దిలీప్‌కుమార్, మళ్ల బుల్లిబాబు, స్థానిక సర్పంచ్ శానాపతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.