ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారాయణ బెయిల్ రద్దు...ఝలక్ ఇచ్చిన కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 09:02 PM

మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదో తరగతి పరీక్ష పత్రాల లీక్ కేసులో కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేసింది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆయనను గత ఏప్రిల్ లో అరెస్ట్ చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో చిత్తూరు వన్ టౌన్ పోలీసులు 9వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం... నారాయణ బెయిల్ రద్దు చేసింది. నవంబరు 30వ తేదీ లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. 


ఈ ఏడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లాలోని నెల్లేపల్లి హైస్కూల్ లో లీకైన టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో దర్శనమిచ్చింది. దీని వెనుక నారాయణ హస్తం ఉన్నట్టు చిత్తూరు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనను కోర్టులో హాజరు పర్చగా, నారాయణ 2014లోనే నారాయణ సంస్థల అధినేతగా తప్పుకున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిలును చిత్తూరు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దు చేసింది. ఇదిలావుంటే అప్పట్లో ఈ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఈ కేసు కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa