విజయవాడకు మహాసదవకాశం కలిసొచ్చింది. విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు అక్టోబర్ 31 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడి నుంచి షార్జాకు నేరుగా సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. వారంలో రెండు రోజులు(సోమ, శని వారాల్లో) షార్జాకు విమానాలు నడుపుతామని పేర్కొంది. ఈ సర్వీసుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు షార్జా నుంచి రానున్న ఎయిర్ ఇండియా విమానానికి స్థానిక ఎంపీ, విజయవాడ పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి స్వాగతం పలుకుతారు.
ఈమేరకు విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి షార్జా వెళ్లేందుకు నేరుగా సర్వీసులు లేవు. హైదరాబాద్ కు వెళ్లి, అక్కడి నుంచి షార్జా వెళ్లాల్సి వచ్చేదని వివరించారు. ఇందుకు చాలా సమయం పట్టేదని తెలిపారు. తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి డైరెక్ట్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో కేవలం నాలుగు గంటలలో విజయవాడ నుంచి షార్జా చేరుకోవచ్చని పేర్కొన్నారు. విజయవాడ నుంచి షార్జాకు టికెట్ ధరలు రూ.13,669 నుంచి ప్రారంభమవుతాయని, షార్జా నుంచి విజయవాడకు రూ.9,000 నుంచి మొదలవుతాయని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం షార్జా వెళ్లే వాళ్ల సంఖ్య ఎక్కువేనని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో షార్జాకు నేరుగా సర్వీసులు నడిపే విషయంలో కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. ఎయిర్ ఇండియా అధికారులతోనూ పలుమార్లు భేటీ అయినట్లు వివరించారు. తాజాగా ఈ సర్వీసులు నడిపేందుకు కేంద్రం ఆమోదం తెలపడం, ఎయిర్ ఇండియా సర్వీసులను ప్రారంభించడంపై ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు.