టూ ఫింగర్ టెస్ట్ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదిలావుంటేఅత్యాచారం జరిగినట్టు తేల్చడానికి రెండు వేళ్లతో పరీక్ష (టూ ఫింగర్ టెస్ట్) నిర్వహించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మన సమాజంలో ఈ విధానం ఇంకా కొనసాగుతుండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఇక మీదట కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అత్యాచారం, హత్య కేసులో ఓ వ్యక్తిని ట్రయల్ కోర్టు దోషిగా తేల్చగా, దీన్ని కొట్టివేస్తూ ఝార్ఖండ్ హైకోర్టు నిందితుడిని విడుదల చేసింది. హైకోర్టు తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. అత్యాచార బాధితులను పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్ టెస్ట్ మహిళల గోప్యత, గౌరవానికి భంగకరమని దశాబ్దం క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేయడాన్ని గుర్తు చేసింది.
ఓ మహిళ శృంగారంలో చురుగ్గా ఉన్నంత మాత్రాన ఆమె అత్యాచారానికి గురి కాదని చెప్పలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాఠ్యాంశాల నుంచి, విద్యా మెటీరియల్ నుంచి టూ ఫింగర్ టెస్ట్ అంశాన్ని తొలగించాలని ఆదేశించింది. ఈ టెస్ట్ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రాల డీజీపీలను కోరింది.