ట్విట్టర్ బ్లూ టిక్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఇటీవల బ్లూ టిక్ ఖాతాదారులకు నెలవారీ చార్జీలను పెంచేసింది. యూజర్ అకౌంట్ అధికారికమైనదనే నిర్ధారణకు చిహ్నంగా ట్విట్టర్ బ్లూ టిక్ ఇస్తుంటుంది. దీని కోసం యూజర్లు ప్రతి నెలా 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే బ్లూ టిక్ కోల్పోతారని సంస్థ కొత్త యజమాని మస్క్ ప్రకటించడం తెలిసిందే. దీనిపై ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ఆసక్తికరంగా స్పందించింది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’ అని ట్వీట్ చేసింది. దీనికి మస్క్ స్పందించలేదు కానీ, జొమాటో మంచి చర్చకు తెరతీసింది.
‘TESLA లేదంటే doggy అనే కూపన్ కోడ్ అప్లయ్ చేయండి’ అంటూ ఓ యూజర్ చమత్కారంగా కామెంట్ చేశాడు. జొమాటోలో డిస్కౌంట్ కూపన్ల మాదిరిగా ఈ సమాధానం ఇచ్చినట్టయింది. మరో యూజర్ స్పందిస్తూ.. ‘తప్పకుండా 60 శాతం డిస్కౌంట్ తర్వాత 3.2 డాలర్లు అవుతుంది. దీనికి 2.4 డాలర్లను ప్యాకేజింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జీలు, డెలివరీ చార్జీల కింద మరో 2.4 డాలర్లను కలపండి. మొత్తం 8 డాలర్లు అవుతుంది. మీరు మా సేవను ఆనందించారని భావిస్తున్నాం’ అంటూ స్పందన వ్యక్తం చేశాడు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా చేస్తానంటూ.. మాట్లాడేందుకు నెలకు 8 డాలర్లు అడుగుతున్నారని ఓ మహిళా యూజర్ పేర్కొంది.