తెలుగుదేశం పార్టీని నెలకొల్పడం ద్వారా.. రాజకీయ నాయకుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి నుంచి ప్రజల చుట్టూ రాజకీయ నాయకులు తిరిగే విధంగా దివంగత ఎన్టీఆర్ కల్పించారని ఆ పార్టీ నాయకులు టి.డి.జనార్దన్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా బహ్రెయిన్‌లో టీడీపీ నిర్వహించిన సాముహిక వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కరణం, మనసబు వ్యవస్థ రద్దు, రూ.రెండుకు కిలో బియ్యం పథకం, మండల వ్యవస్థ ఏర్పాటు తదితర నిర్ణయాల ద్వారా ప్రజా సంక్షేమానికి ఎన్టీఆర్ ఒక నూతన నిర్వచనం ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి గతం నుంచి నేటి జగన్ సర్కారు చేస్తున్న ఆటవిక పాలన చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధితో ఈరోజు తెలుగు యువత గల్ఫ్ సహా ప్రపంచం నలుమూలలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారంటే.. దానికి కారణం.. నాడు చంద్రబాబు ముందుచూపే కారణమని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లోని ప్రముఖ సామాజిక కార్యకర్త డొర్నాల శివకుమార్, టీడీపీ బహ్రెయిన్ విభాగం అధ్యక్షుడు రఘునాథ్‌బాబు, హరిబాబు ప్రసంగించారు. ఎన్నికలకు నెల ముందు తామంతా మాతృభూమికి వెళ్లి టీడీపీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా పలు తెలుగు కుటుంబాలవారు ప్రతిజ్ఞ చేశారు.