దక్షిణ కొరియా దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలోని ఓ జింక్ మైన్ లో ఇటీవల ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు గనిలోపలే చిక్కుకు పోయారు. వారిలో ఒకరి వయసు 62 ఏళ్లు కాగా మరొకరికి 56 ఏళ్లు. వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. రోజులు గడుస్తుండడంతో ఆ కార్మికులు ప్రాణాలతో ఉంటారనే ఆశలు అడుగంటాయి. అయినా రెస్క్యూ పనులు ఆపలేదు. తొమ్మిది రోజుల తర్వాత కార్మికులను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చేర్పించాక ఈ తొమ్మిది రోజులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏంచేశారనేది వారు వెల్లడించారు. ప్రమాదం తర్వాత బయటపడే మార్గం మూసుకుపోయిందని తెలిసి నిరాశకు లోనయ్యామని కార్మికులు చెప్పారు. అయితే, తమను కాపాడేందుకు పైన ప్రయత్నాలు జరుగుతాయని తెలుసని, రెస్క్యూ బృందాలు గుర్తించేవరకూ ప్రాణాలు కాపాడుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి కాఫీ పొడినే చెరిసగం పంచుకుని, చాలా పొదుపుగా తిన్నామని పేర్కొన్నారు. నీళ్లు కూడా కొద్దిగానే ఉండడంతో ప్రతీ చుక్కనూ జాగ్రత్తగా గొంతు తడుపుకునేందుకు వాడుకున్నట్లు ఆ కార్మికులు చెప్పారు.
గనిలో నుంచి బయటపడ్డాక కార్మికులు ఇద్దరినీ వైద్యులు పరీక్షించి, వారు ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. అయితే, రోజుల తరబడి సూర్యరశ్మి తగలకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. శరీరంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడం (హైపోథెర్మియా), కీళ్ల నొప్పులతో బాధపడుతుండడంతో వారికి తగిన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. కాగా, కార్మికులు క్షేమంగా బయటపడడం నిజంగా అద్భుతమేనని, వారు త్వరగా కోలుకోవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పేర్కొన్నారు.