ఏలూరు 1వ డివిజన్ కార్పొరేట్ ఆరేపల్లి రాథ భర్త ఆగడాలు పెచ్చు మీరుతున్నాయని ఆ డివిజన్‌లో తాను చెప్పిందే వేదమని డివిజన్‌లో వలంటీర్లు అంతా ఏ పని చేయాలన్న తనకు చెప్పే చేయాలని అధికార దర్పం ప్రదర్శిస్తున్నాడంటూ ఎస్టీ ఎస్సీ సంఘాలు మండిపడు తున్నాయి. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్ళ నానికి సమస్యలు తెలపాలంటూ హమాలీ కాలనీలో వలంటీర్ ప్రజలను సిద్ధం చేస్తుండగా కార్పొరేటర్ భర్త సత్తిబాబు, మరీదు హరిబాబు, పల్లి వెంకటేశ్వరరావు, చెల్లా బాలాజీ, సంతోష్ కుమార్‌పై అకారణంగా దాడి చేసి కులం పేరుతో దూషించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని విమర్శిం చారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్టీ ఎస్సీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. డివిజన్‌లో కార్పొరేటర్ భర్త దౌర్జన్యం పెరిగిపోయిందని అకారణంగా వలంటీరుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను, ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.