ఓ వ్యక్తిని గొంతుకోసి హత్యచేసిన కేసులో ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. రౌడీయిజం భరించలేకే చంపేసినట్లు గుర్తించామని సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. విజయవాడకు చెందిన పండు (35) రెండేళ్లుగా తిరుపతిలో ఉంటూ క్యాటరింగ్‌లో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అలాగే కర్ణాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా కురుబూరుకు చెందిన పెద్దకంట్ల ప్రభాకర్ (34), తమిళనాడు రాష్ట్రం రాయవెల్లూరు కస్పా వసంతపురానికి చెందిన ఈతడి వజ్రవేలు, మరో నిందితుడు బండరాజు కూడా క్యాటరింగ్ పనులు చేసుకుంటూ నగరంలో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత అందరూ మద్యం, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. పండు కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఆర్టీస బస్టాండ్ ప్రాంతంలో ఒంటరి వ్యక్తులను అటకాయించి, బెదిరించి దోపిడీలు చేయడానికి అలవాటుపడ్డాడు. ఎవరూ దొరక్కపోతే ముగ్గురు స్నేహితులను కొట్టి, వారి వద్ద నుంచి కూడా డబ్బు లాక్కెళ్లేవాడు. క్యాటరింగ్ పనులకని గతనెల 29వ తేదీన చెన్నైకి వెళ్లిన ముగ్గురు స్నేహితులు 31వ తేదీన తిరుపతికి వచ్చారు. వచ్చీరాగానే డబ్బు ఇవ్వాలంటూ పండు వారిని కొట్టాడు. ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. దాంతో ఆ ముగ్గురూ ఈ రౌడీయిజాన్ని భరించలేక పండును అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. 31వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో నెహ్రూవీధిలోని ఓ హోటల్ దగ్గర పండు ఉండగా ముగ్గురూ కలిసి దాడిచేశారు. పథకం ప్రకారం.. బండరాజు, వజ్రవేలు చేతులు పట్టుకోగా ప్రభాకర్ కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి పరారయ్యారు. పండు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు నిందితులకోసం గాలింపు ప్రారంభించారు. సోమవారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద తచ్చాడుతున్న ప్రభాకర్, వజ్రవేలును అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు బండరాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడినీ పట్టుకుంటామని సీఐ తెలిపారు. హత్య కేసును త్వరగా ఛేదించడంపై ఈస్ట్ సీఐతోపాటు ఎస్‌ఐ జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్ మునిరాజులు, వరప్రసాద్, కానిస్టేబుళ్లు ప్రభాకర్, చిరంజీవి, జ్యోతినాథ్‌లను ఎస్పీ పరమేశ్వరరెడ్డి అభినందించారు.