మండల కేంద్రమైన చెన్నూరు మైనార్టీ కాలనీలో బషీర్ బాబా బిల్డింగ్ వెనక వైపున ఉన్న గ్రామ సచివాలయం - 1 సరైన పర్యవేక్షణ లేకపోవడం గేటు వాకిలి లేకపోవడంతో పరిసర ప్రాంతం అంతా ఆకతాయిలకు నిలయంగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజల దగ్గరకు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలు భవన నిర్మాణ పనులు కూడా జరిగాయి.
చెన్నూరు మండలంలో మొట్టమొదటిసారిగా సచివాలయాన్ని ప్రారంభించడం జరిగింది. సచివాలయంలో 9 మంది వరకు ఉన్న సిబ్బంది ముగ్గురు మాత్రమే ఉంటున్నారని పరిసర ప్రాంతాల మైనార్టీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం ముందు భాగంలో అంగన్వాడి కేంద్రం కూడా ఉంది. సచివాలయం ఆవరణం పరిధిలోకి పరిసర ప్రాంతాల ఇండ్ల నుంచి సచివాలయ ఆవరణంలోకి మురికి నీరు వస్తుందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం ఆవరణంలో వర్షపు నీరు నిలుస్తున్నది.
సచివాలయం ఎదురుగా ప్రధాన ముఖద్వారం లేకపోవడంతో రాత్రిపూట ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారంటూ పలువురు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని సచివాలయ పరిసరాలు మురికి నీరు వర్షపు నీరు నిలువ లేకుండా చేయాలని అలాగే ప్రధాన ముఖద్వారం గేటు నిర్మించాలని స్థానిక మైనార్టీ ప్రజలు కోరుతున్నారు.