పవన్ కళ్యాణ్ పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని, పవన్ ఎప్పుడు, ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితి అని రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎద్దేవా చేశారు. ఆదివారం చిత్తూరులో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో అభిమానించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టారంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని మంత్రి రోజా అన్నారు. రౌడీయిజం చూపిస్తూ.. రోజుకో పార్టీ వైపు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూసే ప్రధాని మోదీ దూరం పెట్టారని పేర్కొన్నారు. ప్రజలు కూడా పవన్ గురించి ఆలోచించడమే పూర్తిగా మానేశారన్నారు.
ఇక, జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే బయట పెట్టవచ్చని మంత్రి రోజా సవాల్ విసిరారు. కిరణ్ పేరు చివర రాయల్ అనే పేరు పెట్టుకోవడం జనసేన పార్టీ నుంచి రాజకీయ లబ్ధి పొందడం కోసమేనని మంత్రి రోజా అన్నారు.