ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రా మేధావుల ఫోరం తీవ్రంగా మండిపడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో లక్షలాదిమందిని తరలించి స్వామి భక్తిని చాటుకున్నారని.. కానీ, ఆయన రాష్ట్రానికి ఏమిచ్చారని ఆంధ్రా మేధావుల ఫోరమ్ కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని తన ప్రసంగంలో కనీసం సీఎం జగన్ పేరు కూడా ఎత్తలేదని.. ఇక మోదీ భజన ఎందుకని చలసాని శ్రీనివాస్ నిలదీశారు.
ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సైతం చలసాని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు. గతంలో ప్రధాని మోదీ పిడికేడు మట్టి, పాచిపోయిన లడ్డూ ఏపీకి ఇచ్చారని పవన్ కళ్యాణ్ విమర్శించారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారని గుర్తు చేశారు. అయితే, శుక్రవారం రాత్రి ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉండిపోయారని చలసాని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ బయటికి రావాలని పులుపునిచ్చారు.
రాష్ట్రంలో వామపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేస్తే ఏ రాజకీయ పార్టీ నాయకులు ఖండించలేదని చలసాని శ్రీనివాస్ తప్పుబట్టారు. ఇప్పటికైనా దీనిపై రాజకీయ నాయకులు స్పందించాలని కోరారు. ప్రధాని మోదీ ఏపీకి చేస్తున్న అన్యాయంపై విద్యార్థి సంఘలు, వామపక్షలు, ప్రజా సంఘలను కలుపుకుని ఢిల్లీ నుంచి గల్లీ వరకు మడం తిప్పకుండా.. మాట మార్చకుండా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చలసాని వెల్లడించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ తన పాదయాత్రలో ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.