జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ నిరూపించలేకపోయారని వైసీపీ ఎంపీ చంద్రశేఖర్ విమర్శించారు. ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. 651 లే ఔట్‌లలో నిర్మిస్తున్న 79 వేల జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పవన్ కళ్యాణ్ టూర్‌పై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఫైరయ్యారు.
జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని ఎంపీ చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయాల్లో క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు.. పవన్ కళ్యాణ్ మధ్య పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు. తనపైన కేసులు ఉన్నాయంటూ యువతకు పవన్ కళ్యాణ్ చెబుతున్నారన్నారు. మీపైన పోలీసులు కేసులు కేసులు పెట్టినా పోరాడాలంటూ యువతను రెచ్చగొట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని చెప్పారు.
పవన్ కళ్యాణ్‌ను సినిమా నటుడిగా ప్రజలు గౌరవిస్తారు కానీ.. ఓట్లు వేయరనే సంగతి గుర్తించాలని ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. పైసా అవినీతి లేకుండా టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్పష్టం చేశారు.